తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లోకకల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి.పర్యావరణ హితమే సమాజానికి రక్ష. రోజూ మొక్కలు నాటడం అభినందనీయం. శాంతి, ఐక్యతలతోనే సమాజ ప్రగతి.ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యత. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ల పాదయాత్రకు సంఘీభావం. లోకకల్యాణం, మానవాళి శాంతి, ఐక్యతలే లక్ష్యంగా సాగుతున్న పాదయాత్ర విజయవంతం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ఆకాంక్షించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి తిరుపతి వెంకటేశ్వరస్వామి క్షేత్రం వరకు సుమారు 600 కిలోమీటర్ల మేర చేపట్టిన ‘భద్రాద్రి రాముడు టు గోవిందుడు’ పాదయాత్ర బృందానికి భద్రాద్రి జిల్లా సరిహద్దులో మేయర్ మూడ్ గణేష్‌తో కలిసి ఆయన ఘనంగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. సర్వజనుల సంక్షేమం, మానవ సమాజంలో శాంతి నెలకొనాలనే సంకల్పంతో ఈ యాత్ర చేపట్టడం హర్షణీయమన్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనతో పాటు సమాజ హితం కోసం ప్రతిరోజూ ఒక చెట్టు నాటుతూ, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడం గొప్ప పర్యావరణ స్పృహకు నిదర్శనమని కొనియాడారు. భక్తిభావానికి సామాజిక స్పృహను జోడించి చేపట్టిన ఈ మహత్తర కార్యం ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయమని ఆయన పేర్కొన్నారు. పాదయాత్ర బృందంలో త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్లు గొల్లపూడి వీరేంద్ర చౌదరి, వై. వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ మురళి, సనత్, సురేష్ తదితరులు వున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ