తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పీపీపీ విధానంలో పర్యాటక రంగానికి పెట్టుబడులను ఆకర్షించాలి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి మంజూరైన పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలని రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. వాణి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు, బతుకమ్మ వేడుకల నిర్వహణ, ప్రభుత్వ భూముల వినియోగం, పెండింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐడీఓసీ సమావేశ మందిరం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఏ. వాణి ప్రసాద్ సూచించారు. అక్టోబర్ 18న హైదరాబాద్‌లోని సద్దుల బతుకమ్మ ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో రాష్ట్రంలోని జిల్లాల పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతను ప్రతిబింబించేలా నాణ్యమైన వీడియోలను రూపొందించి పంపించాలని సూచించారు. పర్యాటక అభివృద్ధికి అనువైన ప్రభుత్వ భూములు, ప్రాంతాలను గుర్తించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అడ్వెంచర్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, జెట్టీలు, హోటళ్లు, రహదారి పక్కన రెస్టారెంట్లు, ఎకో కాటేజీలు, హెరిటేజ్ గ్రామాలు, కోటలు వంటి పర్యాటక ఆకర్షణలను అభివృద్ధి చేసేందుకు పెట్టుబడిదారులను ఆకర్షించాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన పర్యాటక ప్రాంతాలతో పాటు మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటి వివరాలను సమర్పించాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అనువైన ప్రాంతాలు, ప్రభుత్వ భూములను గుర్తించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు జిల్లాలోని పర్యాటక ప్రదేశాల విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేయగల ప్రాంతాలను గుర్తించి పెట్టుబడిదారులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఆర్ఓ పద్మావతి, జిల్లా పంచాయతీ అధికారి అనూష, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ