తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండలం బేతాళపాడు పెద్దవాగు బ్రిడ్జిపై పారాపెట్ పిల్లర్ల నిర్మాణం ఇప్పటికీ చేపట్టకపోవడంపై జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చలమల విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఈ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదాల్లో ప్రాణనష్టం, పలువురికి గాయాలైనప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సుమారు ఏడాదిన్నర క్రితం పెద్దవాగు బ్రిడ్జిపై ట్రాలీ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అంతకుముందు కూడా బ్రిడ్జిపై రెండు, మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఇన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ బ్రిడ్జికి రక్షణగా ఉండాల్సిన పారాపెట్ పిల్లర్ల నిర్మాణం మాత్రం నేటికీ ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రమాదం జరిగిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే సైతం బ్రిడ్జిని సందర్శించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీలు అమలుకు నోచుకోలేదని చలమల విజయ్ విమర్శించారు. పారాపెట్ పిల్లర్లు లేకపోవడం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, బేతాళపాడు పెద్దవాగు బ్రిడ్జిపై పారాపెట్ పిల్లర్ల నిర్మాణ పనులు చేపట్టాలని చలమల విజయ్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ