తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జనాభా గణనను ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలి: భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ. జనాభా గణన ఫేజ్–IIపై రెండు రోజుల సమగ్ర శిక్షణ విజయవంతం 40 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిపై అధికారులకు సమగ్ర అవగాహన.జిల్లాలో జనాభా గణన ఫేజ్–II నిర్వహణకు సంబంధించి ఈ నెల 22, 23 తేదీలలో నిర్వహించిన రెండు రోజుల సమగ్ర శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీఓ) జె. సునీత ఆధ్వర్యంలో, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ అధ్యక్షతన ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ, జనాభా గణన ఫేజ్–IIను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు. జనాభా గణనలో సేకరించే వివరాలు ఖచ్చితంగా ఉండాలని, గణన ప్రక్రియలో నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా గణన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.జనాభా గణన ఫేజ్–IIలో భాగంగా జనాభా వివరాల సేకరణ విధానం, గణన ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, సెన్సెస్ శాఖ రూపొందించిన 40 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన పద్ధతులపై అధికారులకు సమగ్ర శిక్షణ అందించారు. ప్రశ్నావళిలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని, ప్రజల నుంచి సరైన సమాచారాన్ని సేకరించడం, వివరాలను నిర్దేశిత పద్ధతిలో నమోదు చేయడం, సమాచార సేకరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.హైదరాబాద్ సెన్సెస్ శాఖ నుంచి మాస్టర్ ట్రైనర్లుగా పాల్గొన్న రవీందర్ నాయక్, శివ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జనాభా గణనలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు అనుసరించాల్సిన విధానాలు, ప్రశ్నావళి నిర్వహణ, సమాచార సేకరణలో పాటించాల్సిన ప్రమాణాలు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సందేహాల నివృత్తిపై అధికారులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి డి. మధు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి అనూష, జిల్లా విద్యాశాఖ అధికారి శంభుప్రసాద్‌తో పాటు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మండల తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), జిల్లా స్థాయి అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.జనాభా గణన ఫేజ్–IIను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా, పారదర్శకంగా, ఖచ్చితమైన సమాచార సేకరణతో నిర్వహించేందుకు ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ