తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం.దేశభక్తి, త్యాగనిరతి ప్రతిఒక్కరికీ ఆదర్శం.దోపిడీ లేని నవ సమాజం కోసం పోరాడాలి. యువత సామాజిక మార్పు కోసం ఉద్యమించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. అమరవీరుడు భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. భగత్ సింగ్ జయంతి వేడుకలు సోమవారం పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణాలర్పించిన భగత్ సింగ్ త్యాగనిరతి, దేశభక్తి యావత్ భారతదేశానికి నిరంతరం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కేవలం పరాయి పాలకుల నుంచి విముక్తి మాత్రమే కాకుండా, మనుషులపై మనుషులు సాగించే దోపిడీ లేని నవ సమాజ నిర్మాణం కోసం ఆయన కలలు కన్నారని గుర్తుచేశారు. నేటి పాలకులు ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తూ, దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, అసమానతలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో యువత భగత్ సింగ్ ఆలోచనలను ఆదర్శంగా తీసుకొని సామాజిక మార్పు కోసం ఉద్యమించాలని కోరారు. కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణకు కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని స్పష్టం చేశారు. మతోన్మాదం, విభజన రాజకీయాలపై రాజీలేని పోరాటం చేయడమే భగత్ సింగ్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కొరిమి రాజ్ కుమార్, సలీగంటి శ్రీనివాస్, మేయర్ మూడు గణేష్, కంచర్ల జములయ్య, జి వీరస్వామి ఎస్ కే ఫహీం, భూక్యా శ్రీనివాస్, రమణమూర్తి, నేరెళ్ల రమేష్, మండల రాజు, లక్ష్మీనారాయణ, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ