తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం తనిఖీ చేశారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గోడౌన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత కీలకమైన అంశమని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలో భాగంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల నియంత్రణ గదిని సందర్శించి కెమెరాల పనితీరు, రికార్డింగ్ వ్యవస్థ, విద్యుత్ బ్యాకప్, భద్రతా పర్యవేక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. గోడౌన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని సూచించారు. గోడౌన్ వద్ద విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమతి లేని వ్యక్తులను గోడౌన్‌లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కలెక్టర్ ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఏవైనా లోపాలు గుర్తించిన వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఈవీఎం గోడౌన్ తనిఖీ రిజిస్టర్లను పరిశీలించి సంతకం చేశారు. ఈ తనిఖీలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ