తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. మామిడి గుండాల లో భూ రీ సర్వే నెల రోజుల్లో పూర్తి చేయాలి. జీఓ నం. 76 కింద దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన పక్కాగా చేపట్టాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, భూ రీ సర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, కచ్చితత్వంతో విధులు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం ఇల్లందు ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్ ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు, మామిడి గుండాలలో భూ రీ సర్వే పనులు, జీఓ నం. 76 కింద సింగరేణి భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు సంబంధించి చేపట్టిన క్షేత్రస్థాయి సర్వేను పరిశీలించారు.రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల్లో భాగంగా ఇల్లందులోని సింగరేణి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. నూతన ఓటరు నమోదు కోసం ఫారం-6 ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, నమోదు ప్రక్రియ పురోగతిని బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, ప్రత్యేక శిబిరాల సమయంలో బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సంప్రదింపు నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.అనంతరం ఇల్లందు మండలం మామిడి గుండాలలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పురోగతి, భూముల విస్తీర్ణం, గతంలో జారీ చేసిన పట్టాలు, భూ రికార్డులు, సరిహద్దుల నిర్ధారణకు సంబంధించిన వివరాలను సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ పరిధిలోని భూములకు సంబంధించి పాత రికార్డులు, మ్యాప్‌లను పరిశీలించి, గతంలో పట్టాలు జారీ చేసిన భూముల సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. అటవీ, రెవెన్యూ భూముల హద్దుల విషయంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. బోటి గుంపులో మొత్తం 4,733 ఎకరాల భూమి ఉన్నట్లు, గ్రామ పరిధిలోని 130వ సర్వే నంబరులో సుమారు 4,200 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు సర్వే సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. భూ సరిహద్దుల నిర్ధారణలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహించి, నెల రోజుల్లోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా ఎంపీడీవో, ఏపీఎం అందుబాటులో లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పర్యటనకు సంబంధించిన విధుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేస్తూ, సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో జీఓ నం. 76 కింద సింగరేణి భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారి స్థలాల పరిశీలనకు సంబంధించి నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సర్వేను కూడా కలెక్టర్ పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరును, స్థలాల వాస్తవ పరిస్థితులను, దరఖాస్తుదారుల వివరాల నమోదు ప్రక్రియను సమీక్షించారు. దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత రికార్డులతో సరిపోల్చుకోవాలని అధికారులకు సూచించారు. స్థలాల విస్తీర్ణం, సరిహద్దులు, వినియోగం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును పారదర్శకంగా పరిశీలించాలని, సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను సంబంధిత రికార్డులతో ధ్రువీకరించి, తదుపరి ప్రక్రియను నిబంధనల మేరకు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కాశీరాం, జిపిఓ లక్ష్మీకాంత్, మామిడి గుండాల సర్పంచ్ ఎట్టి రమణ మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ