తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలి. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి.ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వొద్దు. జిల్లా జాయింట్ కలెక్టర్ డి.వేణుగోపాల్. వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుంచి స్వీకరించే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి వేణుగోపాల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ పద్మావతి, ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్, హౌసింగ్ పిడి సవేరామ్ తో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. భూ సంబంధిత సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, ఉపాధి, పింఛన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ముఖ్యమైన వేదికగా నిలుస్తోందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు.తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఎలాంటి ఆలస్యం లేకుండా పరిష్కరించాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలోని ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమకు సమీపంలోని ఎంపీడీవో కార్యాలయంలో వినతులు సమర్పించి, స్థానిక స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం పొందాలని సూచించారు. వినతులతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రజావాణిలో వచ్చిన కొన్ని వినతులు : అశ్వాపురం మండలం నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి నిధులు దుర్వినియోగం చేసినందుకు అతనిని తొలగించి చట్టపరమైన క్రిమినల్ కేసులు పెట్టుట కొరకు, గుండాల మండలం కొడవ దంచ గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను నివారించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయుట కొరకు, మణుగూరు మండలం అజయ్ నగర్ గ్రామానికి చెందిన చిట్టిమల్ల శిరీష అంగన్వాడి టీచర్ ఉద్యోగానికి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ సమర్పించనందున విచారణ జరిపి న్యాయం చేయుట గురించి, మణుగూరు మండలం రామానుజవరం గ్రామపంచాయతీ మల్లేపల్లి గ్రామానికి చెందిన తడికల ఆకాంక్ష అంగనవాడి టీచర్ ఉద్యోగానికి మెరిట్ ఉన్న ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయలేదని తగిన న్యాయం చేయుట కొరకు దరఖాస్తుల సమర్పించారని ఆయన అన్నారు.సంబంధిత అధికారులు ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ