తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ఐక్యతా దినోత్సవం సందర్భంగా పటేల్ చిత్రపటానికి ఘన నివాళులు అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం ఐడీఓసీ కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఆర్ఓ పద్మావతితో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రజలంతా బేధాభిప్రాయాలను విడనాడి జాతీయ ఐక్యతా భావంతో మెలగాలని సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ నుంచి మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గొప్ప నాయకులు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారని తెలిపారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం లభించిన అనంతరం సుమారు 500 సంస్థానాల విలీనం పెద్ద సవాలుగా మారిందని అన్నారు . ఆ సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన భారత తొలి ఉప ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాల విలీనం కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. తన దృఢ సంకల్పం, కార్యదక్షతతో సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి జాతీయ సమైక్యతకు బలమైన పునాదులు వేశారని కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ఐక్యతా మార్గంలో దేశం ముందుకు సాగుతూ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం, సమైక్యత కోసం జాతీయ నాయకులు చేసిన పోరాటాలు, త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జాతి మొత్తం ఐక్యత, సమగ్రత, సోదరభావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ సునీత, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, డీపీఓ అనూష, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, ఓఎస్డీ వెంకటరమణతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ