తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఆర్థిక పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా డిమాండ్ చేశారు. బుధవారం కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) ఆధ్వర్యంలో జరిగిన ప్రవళిక సంతాప సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రవళిక చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సాబీర్ పాషా మాట్లాడారు. ప్రయాణికులు బస్సు కిందకు తోసేయడంతో తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రవళిక మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ఆర్టీసీ సిబ్బందిపై, ముఖ్యంగా మహిళా ఉద్యోగులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ఈయూ నాయకులు కందుల భాస్కర్, సీపీఐ నాయకులు జక్కుల రాములు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ