తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తుఫాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. సుజాతనగర్ మండల పరిధిలో తుఫాను వల్ల దెబ్బతిన్న వరి, పత్తి, మిరప, మొక్కజొన్న తోటలను గురువారం సీపీఐ బృందం పరిశీలించింది. నీట మునిగిన పంటలను చూసి, బాధిత రైతులతో మాట్లాడి నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. చేతికందే దశలో ఉన్న వరి పంట నీటిపాలై మొలకలు వస్తుంటే, పత్తి చేలు కుళ్లిపోయి నల్లబడ్డాయని, మిరప తోటల్లో తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేపట్టి, ఎకరా వరి, మొక్కజొన్నకు రూ.40 వేలు, మిరప, పత్తికి రూ.50 వేలు, ఉద్యాన పంటలకు రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, న్యాయం జరిగే వరకు సీపీఐ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో సిపిఐ, ఏఐకేఎస్, బికేయంయు నాయకులు సలిగంటి శ్రీనివాస్, భూక్య దస్రు, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ