తెలుగు వెలుగు టీవీ - రాజకీయ / కొత్తగూడెం : గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలుప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రజలందరూ గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, శాంతియుత ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గణేష్ మండపాల నిర్వాహకులు మండపం ఏర్పాటు చేయడానికి ముందుగానే పోలీసులకు సమాచారం అందించడంతో పాటు పోలీసు శాఖ రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో మండపానికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భద్రత, బందోబస్తు ఏర్పాట్లకు ఈ వివరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.గణేష్ మండపాల ఆన్‌లైన్ నమోదు పోర్టల్:http://policeportal.tspolice.gov.in/index.htmఆన్‌లైన్‌లో మండప వివరాలను నమోదు చేసి, అనంతరం దరఖాస్తు వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని సూచించారు. మండపాలను ప్రధాన రహదారులు, ప్రజా రవాణా మార్గాలు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించే విధంగా ఏర్పాటు చేయరాదన్నారు. విద్యుత్ శాఖ అనుమతులతోనే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, 24 గంటలు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసుల అనుమతితో నిబంధనలకు లోబడి పరిమిత శబ్దంతో స్పీకర్లు మాత్రమే వినియోగించాలని, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు వినియోగించరాదని తెలిపారు. చిన్నారులు, వృద్ధులు తదితరులకు ఇబ్బంది కలిగించే విధంగా పరిమితికి మించి శబ్దాలు వినియోగించరాదన్నారు.నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. నిర్ణీత సమయాల్లోనే నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తూ ప్రజలు, ఇతర వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. శోభాయాత్రలో టపాసులు పేల్చడం, డీజేలు ఏర్పాటు చేయడం నిషేధమని తెలిపారు.శోభాయాత్రలో మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే విధంగా వాహనాలను రహదారులపై నిలిపివేయరాదని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో పోలీసుల సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు.గణేష్ ఉత్సవాల సందర్భంగా రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లు, సమస్యాత్మక వ్యక్తులపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలకు అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తూ పోలీసు శాఖకు ప్రజలు, మండపాల నిర్వాహకులు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ